హత్య కేసులో బెయిల్‌పై బయటికొచ్చి మరో ఇద్దర్ని చంపిన లారీ డ్రైవర్!

హత్య కేసులో బెయిల్‌పై బయటికొచ్చి మరో ఇద్దర్ని చంపిన లారీ డ్రైవర్!
  • 2019లో పొరుగింటి మహిళను చంపిన వ్యక్తి
  • రెండు నెలల కిందటే బెయిల్
  • తాజాగా మహిళ కుటుంబ సభ్యులను కూడా కత్తికి బలిచేసిన వైనం
  • కేరళలో సంచలనం సృష్టించిన ఘటన
భార్య, కూతురు తనను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందన్న కోపంతో ఓ మహిళను హత్య చేసిన లారీ డ్రైవర్... ఆ కేసులో బెయిల్‌పై బయటికొచ్చి ఆ మహిళ భర్తను, ఆమె అత్తను కూడా కత్తికి బలి చేసిన ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. 

పాలక్కాడ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల చెంతమార అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 2019లో తన పక్కింట్లో ఉండే సజిత అనే మహిళను చెంతమార హత్య చేశాడు. భార్య, కుమార్తె తనను వదిలి వెళ్లిపోవడానికి కారణం సజిత అని కోపం పెంచుకున్న చెంతమార... ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ హత్య 2019లో జరిగింది. 

అతడికి రెండు నెలల కిందట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, సజిత భర్త సుధాకరన్ (54) ను, సుధాకరన్ తల్లి లక్ష్మి (76)ని కూడా చెంతమార హత్య చేశాడు. చెంతమార బెయిల్‌పై బయటికి వచ్చినప్పుడే... అతడు మరోసారి ఏదైనా ఘాతుకానికి పాల్పడే అవకాశం ఉందని సుధాకరన్, లక్ష్మి, పలువురు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి భయమే నిజమైంది. 

మొదట సజితను చంపినప్పుడే... మరో ఇద్దరిని కూడా చంపుతానని చెంతమార చెప్పాడని, చెప్పినట్టే చేశాడని ఓ స్థానికుడు వెల్లడించాడు. ఈ ఘటనలు చూస్తుంటే అతడి మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని, ఏదేమైనా అతడిలో ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయని ఈ హత్యలతో రుజువైందని ఆ స్థానికుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం చెంతమార పరారీలో ఉండడంతో, పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


More Telugu News