యువగళానికి రెండేళ్లు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుక‌లు

యువగళానికి రెండేళ్లు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుక‌లు
  • రెండేళ్ల క్రితం ఇదే రోజున కుప్పంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • విశాఖపట్నంలోని అగనంపూడిలో పాద‌యాత్ర‌ను ముగించిన లోకేశ్‌ 
  • 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర కొన‌సాగిన యువగళం పాదయాత్ర
  • రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఘ‌నంగా వేడుక‌లు నిర్వ‌హించిన టీడీపీ నేత‌లు
నాడు నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి స‌రిగ్గా రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... సరిగ్గా రెండేళ్ల క్రితం యువగళం తొలి అడుగు పడిందని తెలిపారు. ఆటంకాలు ఎదురైనా, అనేక ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పన్నినా... జనమే బలమై, బలగమై యువనేత  నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రను జైత్రయాత్రగా నడిపించార‌ని నేత‌లు ప్ర‌శంసించారు. 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నంలోని అగనంపూడిలో పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. 3,132 కిలోమీటర్లు, 226 రోజులు ఈ పాదయాత్ర సాగింది. యువగళం పాదయాత్రను జరిగే క్రమంలో అప్పటి ప్రభుత్వం టీడీపీ నాయకులపై అనేక కేసులు పెట్టినా, రాళ్లు విసిరినా, దాడులు చేసినా అదరక, బెదరక యువగళం పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారు. చివరకు కూటమి ఘన విజయంలో లోకేశ్ కీలకపాత్ర వహించారు. 

నారా లోకేశ్‌ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేశ్ ఆలోచనలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులౌతున్నారని, పాదయాత్ర స‌మ‌యంలో ప్రజలు విన్నవించుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయ‌న‌ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన అన్ని విధాలా పాటుపడుతున్నారని తెలిపారు.

తండ్రికి తగ్గ తనయుడిలా సీఎం చంద్రబాబు మాదిరే మంత్రి నారా లోకేశ్‌ ప్రతిక్షణం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని వారు వివరించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టి విద్యార్థులను ఉన్నత మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని... రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ఏఐ టెక్నాలజీకి దేశంలో ఏపీని కేంద్రంగా మార్చ‌డానికి ఆయన చేస్తున్న కృషి హర్షణీయమని టీడీపీ నేతలు కొనియాడారు.  

ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రాంగోపాల్ రెడ్డి, ఫైబర్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్‌, యువగళం టీం సభ్యులు కాసరనేని జశ్వంత్, నారాయణస్వామి, రామారావు, రమణారెడ్డి, అనిల్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, పాతర్ల రమేశ్‌, పరుచూరి కృష్ణ, ఆహ్వాన కమిటీ ఛైర్మన్ హాజీ హసన్ బాషా, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ రమణ, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు తదితర నేతలు పాల్గొన్నారు.



More Telugu News