పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు

పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు
  • సామాజిక కార్యకర్త-సీఐ మధ్య నాలుగేళ్లుగా శారీరక బంధం
  • ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సీఐపై మహిళ ఫిర్యాదు
  • కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ
  • అత్యాచార ఆరోపణలను నేరంగా పరిగణించలేమన్న కోర్టు
  • భౌతిక దాడి, మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత ఆరోపణలకు బలం ఉందన్న న్యాయస్థానం
  • కేసు కొట్టివేసేందుకు నిరాకరణ
పరస్పర అంగీకారంతో శృంగార బంధం నెరుపుతున్నంత మాత్రాన మహిళపై దాడిచేందుకు అది లైసెన్స్ కాబోదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ సామాజిక కార్యకర్తపై పోలీసు అధికారి ఒకరు లైంగిక వేధింపులు, భౌతిక దాడికి పాల్పడిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.అశోక్‌కుమార్, బాధిత సామాజిక కార్యకర్త 2017 నుంచి 2022 వరకు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2021 నవంబర్ 11న అశోక్‌ కుమార్ ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనతో బలవంతంగా శృంగారం చేశాడని, భౌతికంగానూ దాడిచేశాడని ఆమె ఆరోపించారు. ఆ తర్వాతి రోజు అతడు తనను ఓ బస్టాప్‌లో విడిచిపెట్టాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరి గాయాలకు చికిత్స చేయించుకున్నారు. 

అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అశోక్ కుమార్ తనను నిర్బంధించి అత్యాచారం చేశాడని, భౌతిక దాడికి పాల్పడ్డాడని, హత్యాయత్నం చేశాడని ఆరోపించారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ కుమార్ కోర్టును ఆశ్రయించారు. తమ మధ్య బంధం పరస్పర అంగీకారంతో కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు. 

కేసును విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శృంగార సంబంధం కొనసాగిస్తున్నప్పటికీ, మహిళపై దాడికి అది లైసెన్స్ కాబోదని జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు. ఫిర్యాదుదారుపై నిందితుడు స్త్రీ ద్వేషంతో కూడిన క్రూరత్వం ప్రదర్శించినట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే, ఏకాభిప్రాయంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న శారీరక బంధాన్ని నేరంగా పరిగణించలేమని, అత్యాచారం ఆరోపణలను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. అయితే, మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలకు బలం ఉందని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ విషయంలో విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. 


More Telugu News