బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు

బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్
  • బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్న మేయర్
  • గంగుల కమలాకర్ ఆర్థిక పరిస్థితి అప్పుడేమిటి? ఇప్పుడేమిటి? అని నిలదీత
కరీంనగర్ మేయర్ సునీల్ రావు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. సునీల్ రావుకు బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

గంగుల కమలాకర్ టీడీపీ నుంచి వచ్చారని, ఆయన ఆర్థిక పరిస్థితి అప్పుడేమిటి? ఇప్పుడేమిటి? అని ప్రశ్నించారు. టెండర్ల తర్వాత కమిషన్ ముడితే చాలు ఆ తర్వాత గంగుల కనిపించరని ఆరోపించారు. ఆ పనుల గురించి కూడా ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. కరీంనగర్‌లో ప్రతి కుంభకోణం వెనుక ఆయన పాత్ర ఉందన్నారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందన్నారు.

గంగుల కమలాకర్ కరీంనగర్ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. డ్రైనేజీ నీళ్లు మళ్లించకుండా మానేరు రివర్ ఫ్రంట్ పేరిట నిధులు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధి ఆగిపోవద్దనే ఉద్దేశంతో తాను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని వెల్లడించారు.

చెక్ డ్యాంలు, రోడ్ల కాంట్రాక్టర్లంతా గంగుల కమలాకర్ బినామీలేనని... అందుకే అవి త్వరగా కొట్టుకుపోయాయని ఆరోపించారు. తనకు మేయర్ పదవి రాకుండా గంగుల కమలాకర్ అప్పుడే అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. కేవలం కేంద్రం నిధులతోనే నగర అభివృద్ధి జరిగిందన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు. త్వరలో మరికొంతమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారని జోస్యం చెప్పారు.


More Telugu News