విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సజ్జల

విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: సజ్జల
  • వైసీపీ కార్యాలయంలో మీడియా కమ్యూనికేషన్స్ వర్క్ షాప్
  • కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల
  • టీడీపీకి మీడియాలో ఓ వర్గం అండ ఉందని వ్యాఖ్యలు
  • దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపు 
ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. మీడియా కమ్యూనికేషన్స్ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. వర్క్ షాప్ ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాజకీయ పార్టీ చేయనంత గొప్పగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసిందని అన్నారు. అయితే, చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని స్పష్టం చేశారు. అ

దే సమయంలో, తాజా పరిణామాలపై నేతలు అవగాహన పెంచుకోవాలని సజ్జల సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏంచేస్తుందో గమనించాలని తెలిపారు. సమర్థ వాదనతో ప్రజల్లో సానుకూలత సంపాదించాలని, ప్రభుత్వ విష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కూడా పార్టీలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. 2019లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా మీడియాలో ఓ వర్గం వ్యతిరేకంగా భారీ ఎత్తున దుష్ప్రచారం చేసిందని, అయినా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిందని సజ్జల గుర్తుచేశారు. 

టీడీపీ పూర్తిగా మీడియా ప్రచారం అండతోనే నడుస్తోందని, ఆ పార్టీకి కొంత బలమైన అనుకూల మీడియా మద్దతు ఉందని పేర్కొన్నారు. దాంతో అబద్ధాలను కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అనుకూల మీడియాలో కనిపించేదంతా నిజం కాదని మనం గ్రహించాలని, ఆ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియా, సోషల్ మీడియాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఇంకా చేరువ కావడంపై దృష్టి పెట్టాలనిసూచించారు. 

పార్టీలో కొత్తగా పదవులు స్వీకరించిన వారు, బాధ్యతలు చేపట్టిన వారు తమ ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల ముందు, వివిధ శక్తుల ముందు తమ వాదనను సమర్థంగా వినిపించాలని అన్నారు. అందుకోసం అవసరమైన ప్రోత్సాహాన్ని, సమాచారాన్ని, విధానాలను అందించేందుకు నేటి మీడియా కమ్యూనికేషన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని సజ్జల వివరించారు.


More Telugu News