చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెల‌ల జైలు శిక్ష‌

చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెల‌ల జైలు శిక్ష‌
  • రామ్ గోపాల్ వర్మకు అంధేరీ కోర్టు గ‌ట్టి షాక్ 
  • ఆర్‌జీవీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ 
  • 3 నెల‌ల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాల‌ని ఆదేశం
వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్‌జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేగాక మూడు నెల‌ల్లో ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయ‌ని ప‌క్షంలో మ‌రో మూడు నెల‌లు సాధార‌ణ జైలు శిక్ష అనుభ‌వించాల‌ని కోర్టు పేర్కొంది.  

2018లో మహేష్ చంద్ర అనే వ్య‌క్తి వేసిన ఈ చెక్ బౌన్స్‌ కేసులో భాగంగా కోర్టు ఈరోజు ఈ విధంగా తీర్పునిచ్చింది. గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడూ కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయ‌న‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పుని ఇచ్చింది.

ఇదిలాఉంటే.. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే త‌న సూప‌ర్ హిట్ మూవీ సత్య రీ రిలీజ్ సందర్భంగా ఆర్‌జీవీ రియలైజ్ అయ్యారు. తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. 

తనకు పరిశ్రమ ఇచ్చిన అవకాశాల్ని తాను ఉపయోగించుకోలేదని అన్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేశానని ఆయ‌న‌ పశ్చాత్తాప్పడ్డారు. ఇకపై తాను మంచి సినిమాలే తీస్తానని చెప్పుకొచ్చారు.


More Telugu News