'హీ ఈజ్ బ్యాక్‌'.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ!

'హీ ఈజ్ బ్యాక్‌'.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ!
  • చాలా కాలం త‌ర్వాత తిరిగి జ‌ట్టులో చేరిన మ‌హ్మ‌ద్ ష‌మీ
  • ష‌మీ బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోను పంచుకున్న బీసీసీఐ
  • స్టార్‌ పేస‌ర్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బౌలింగ్ కోచ్‌, ప్లేయ‌ర్లు
బీసీసీఐ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. అందులో టీమిండియా సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయ‌డం ఉంది. 'హీ ఈజ్ బ్యాక్' అంటూ బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

2023 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గాయ‌ప‌డిన త‌ర్వాత జ‌ట్టుకు దూర‌మైన ఈ స్టార్ పేస‌ర్ తిరిగి ఇప్పుడే జ‌ట్టులోకి వ‌చ్చాడు. త్వ‌ర‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగే టీ20, వ‌న్డే సిరీస్‌ల‌తో పాటు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టులోనూ ష‌మీ చోటు ద‌క్కించుకున్నాడు. దీంతో ఆదివారం జ‌ట్టుతో క‌లిసిన అత‌డు.. ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మొద‌లు పెట్టాడు. 

అంత‌కుముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఈడెన్ గార్డెన్స్‌కు వ‌చ్చిన ష‌మీని హ‌త్తుకుని తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చినందుకు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం వీడియోలో ఉంది. అలాగే ప్రాక్టీస్ ముగిసిన త‌ర్వాత ష‌మీ అభిమానుల‌కు ఆటోగ్రాఫ్ ఇవ్వ‌డం కూడా వీడియోలో చూడొచ్చు.    

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ బీసీసీఐ ష‌మీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను విడుద‌ల చేసింది. ఇక ష‌మీ జ‌ట్టుతో చేర‌డం వ‌ల్ల‌ మ‌న బౌలింగ్ విభాగానికి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీలో జ‌స్ప్రీత్‌ బుమ్రా, ష‌మీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ త్ర‌యం టీమిండియాకు బాగా క‌లిసొచ్చే అంశం. ఇక‌ బ్యాటింగ్‌లో ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండే భార‌త జ‌ట్టు.. ఈసారి ముగ్గురితో బౌలింగ్ విభాగంలోనూ మ‌రింత స్ట్రాంగ్‌గా క‌నిపిస్తోంది. 


More Telugu News