అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం.. ప్రశాంతంగా గాజా

అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం.. ప్రశాంతంగా గాజా
  • ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా కొననసాగుతున్న యుద్ధం
  • ఆదివారం నుంచి అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం
  • తొలి విడతగా ముగ్గురు యువతుల్ని విడుదల చేసిన హమాస్
దాదాపు 15 నెలలపాటు బాంబుల మోత మోగిన గాజా ఆదివారం ప్రశాంతంగా కనిపించింది. అమెరికా, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం కారణంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేసేందుకు హమాస్, ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న 737 మంది పాలస్తీనీయులను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి.

ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజా ప్రశాంతంగా కనిపించింది. నిజానికి నిన్న ఉదయం 8.30 గంటల నుంచే కాల్పుల విరమణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, తొలి విడతగా ముగ్గురు ఇజ్రాయెలీ యువతులు రోమి, ఎమిలి దమారి, డోరాన్ స్టెయిన్‌బెర్‌లను హమాస్ ఆలస్యంగా 11.15 గంటలకు విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అప్పటి వరకు కాల్పులు కొనసాగించింది. ఖాన్‌యూనిస్‌పై జరిగిన ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు. కాగా, విడుదల చేసిన ముగ్గురు యువతులను రెడ్‌క్రాస్‌కు హమాస్ అప్పగించింది. మరోవైపు, ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేయకుంటే గాజాలో యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. 


More Telugu News