తన వ్యాఖ్యలపై విచారం.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు

తన వ్యాఖ్యలపై విచారం.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు
  • సైఫ్‌పై దాడిని తన బహుమతులకు ముడిపెట్టి మాట్లాడిన ఊర్వశీ రౌతేలా
  • విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన నటి
  • తన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలంటూ సైఫ్‌కు వేడుకోలు
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దుండగుల దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అక్కడి వరకు బాగానే ఉన్నా తన వజ్రపుటుంగరం, రోలెక్స్ వాచీలను చూపిస్తూ మాట్లాడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన ఊర్వశి.. సైఫ్‌కు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.

సైఫ్ గురించి మాట్లాడే సమయంలో తాను ప్రవర్తించిన తీరుకు ఊర్వశి విచారం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూ సమయంలో సైఫ్‌పై జరిగిన దాడి  తీవ్రత తనకు తెలియదని పేర్కొంది. కొన్ని రోజుల నుంచి తాను డాకు మహారాజ్ సినిమా విజయోత్సాహంలో ఉన్నానని వివరించింది. దీంతో ఆ సినిమా వల్ల తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడానని, ఈ విషయంలో సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డానని పేర్కొంది. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించారని ప్రశంసించింది. మీపై గౌరవం మరింత పెరిగిందని పేర్కొంది.

ఊర్వశి ఇంతకీ ఏమంది?
ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని తెలిపింది. సైఫ్‌పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 150 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపింది. మూవీ విజయం సాధించడంతో అమ్మ తనకు వజ్రపుటుంగరం ఇస్తే, నాన్న రోలెక్స్ వాచీ ఇచ్చారని ఆనందంగా చెప్పుకొచ్చింది. అయితే, వీటన్నింటినీ ధరించి బహిరంగంగా బయటకు వెళ్లలేనని, ఎందుకంటే ఎవరైనా మనపై అలా (సైఫ్‌పై దాడిచేసినట్టు) దాడి చేస్తారన్న భయం ఉంటుందని చెప్పుకొచ్చింది. సైఫ్‌‌పై దాడికి, తన బహుమతులకు ముడిపెట్టి మాట్లాడటంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణలు చెప్తూ తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.



More Telugu News