కొత్త స్కామ్ వచ్చెనండీ... ఫోన్ ఎవరికీ ఇవ్వకండి.. అప్రమత్తంగా లేకుంటే ఖాతా ఖాళీ!

కొత్త స్కామ్ వచ్చెనండీ... ఫోన్ ఎవరికీ ఇవ్వకండి.. అప్రమత్తంగా లేకుంటే ఖాతా ఖాళీ!
  • ఎమర్జెన్సీ కాల్ చేసుకుంటామంటూ ఫోన్లు అడుగుతున్న అపరిచిత వ్యక్తులు
  • ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూనే వ్యక్తిగత సమాచారం తస్కరణ
  • ఓటీపీ కూడా వారి ఫోన్లకు వెళ్లేలా సెట్టింగ్స్ మార్చుతున్న వైనం
  • అప్రమత్తంగా ఉండాలంటూ జీరోదా కంపెనీ సీఈవో నితిన్ కామత్ సందేశం
సైబర్ నేరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంగొత్త మార్గాల్లో మోసాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల కొత్త తరహాలో జరుగుతున్న సైబర్ మోసాలపై జనాలను అప్రమత్తం చేస్తూ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ‘జిరోదా’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ ఇటీవల సోషల్ మీడియా ఒక వీడియో పంచుకున్నారు. కేటగాళ్లు ఎలా మోసం చేస్తారు?, ఎలాంటి వారిని లక్ష్యంగా ఎంచుకుంటారు? అలాంటి స్కీమ్‌ల బారిన పడకుండా ఏం చేయాలి? అనే విషయాలను ఆయన వివరించారు.

‘‘అపరిచిత వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి అత్యవసరంగా కాల్ చేసుకోవాలంటూ మీ మొబైల్‌ని అడుగుతారు. సదుద్దేశంతో చాలా మంది వ్యక్తులు సానుకూలంగా స్పందించి వారి ఫోన్‌ను అందిస్తారు. కానీ, ఇది కొత్త తరహా స్కామ్. ఓటీపీలు మీ ఫోన్‌కు రాకుండా నియంత్రించడం నుంచి మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం వరకు మీకు తెలియకుండానే నష్టాన్ని మిగిల్చి వెళతారు’’ అని నితిన్ కామత్ వివరించారు.

ఫోన్‌ మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తూనే కొత్త యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంటారని, లేదా పర్సనల్ డేటాను డౌన్‌లోడ్ చేసుకుంటారని, ఆ వివరాలతో చేతిలో ఉన్న ఫోన్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ మార్చుతారని ఆయన హెచ్చరించారు. ఫోన్‌కాల్స్, మెసేజులు, అలర్ట్‌లు వారి నంబర్లకే ఫార్వర్డ్ అవుతాయని నితిన్ కామన్ అప్రమత్తం చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీల యాక్సెస్ ఉండడంతో బాధితుల ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలు జరుపుతుంటారని, పాస్‌వర్డ్‌లను కూడా మార్చివేస్తారని అలర్ట్ చేశారు.

కాబట్టి, ఇలాంటి మోసాల నుంచి ఎవర్ని వారు రక్షించుకునేందుకు... ఎవరైనా అపరిచితులు అడిగినప్పుడు ఫోన్‌ను ఇవ్వొద్దని నితిన్ కామన్ సూచించారు. ‘‘ఒకవేళ ఎదుట వ్యక్తులు అత్యవసరంలో ఉన్నారని అనిపిస్తే మీరే నంబర్‌ డయల్ చేసి, స్పీకర్‌ ఆన్ చేసి మాట్లాడాలని వారితో చెప్పండి’’ అంటూ ఆయన సలహా ఇచ్చారు.


More Telugu News