కుటుంబంతో కలిసి భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు

కుటుంబంతో కలిసి భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు
  • భోగిని ఘనంగా జరుపుకున్న తెలుగు రాష్ట్రాలు
  • మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిద్దామన్న మోహన్ బాబు
  • అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష
రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి వేడుకల్లో మునిగిపోయాయి. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ప్రజలు భోగి మంటలు వేశారు. సెలెబ్రిటీలు సైతం కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో నిర్వహించిన భోగి వేడుకల్లో మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భోగి మంటలు వేశారు.

ఈ సందర్భంగా తెలుగువారు అందరికీ మోహన్ బాబు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతికి దూరంగా ఉంటూ... మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిద్దామని అన్నారు. పెద్దల మాటకు గౌరవం ఇస్తూ మన సంప్రదాయాలను కాపాడుకుందామని చెప్పారు. ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జరిగిపోయిన కాలాన్ని మర్చిపోయి, జరగబోయే కాలం గురించి ఆలోచించాలని చెప్పారు. కొత్త సంవత్సరంలో ఎలాంటి కరవు కాటకాలు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. జల్లికట్టులో పాల్గొనే యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


More Telugu News