ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక లీక్... వివరాలు ఇవిగో!

ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక లీక్... వివరాలు ఇవిగో!
  • 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చిన ఢిల్లీ ప్రభుత్వం
  • అవినీతి జరిగినట్టు ఆరోపణలు
  • దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ
  • తాజాగా కాగ్ నివేదికలో అంశాలు ఇవేనంటూ కథనాలు
వివాదాస్పద ఢిల్లీ లిక్కర్ పాలసీపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తాజాగా లీక్ అయినట్టు తెలుస్తోంది. లీకైన వివరాల మేరకు... లిక్కర్ పాలసీలో అవకతవకల కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది. 

మద్యం లైసెన్సుల జారీలో అక్రమాలు జరిగాయని, నిపుణుల కమిటీ సిఫారసులను పక్కనబెట్టారని వివరించింది. టెండర్లలో బిడ్డింగ్ వేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిని ఎలాంటి పరిశీలన చేయలేదని తెలిపింది. నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా బిడ్లు వేసే అవకాశం కల్పించారని, పైగా ఆ కంపెనీల లైసెన్సులను కూడా పునరుద్ధరించారని కాగ్ వెల్లడించింది. 

నాటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం లిక్కర్ పాలసీలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకోలేదని పేర్కొంది. లిక్కర్ పాలసీని సరిగ్గా అమలు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని, తద్వారా లిక్కర్ పాలసీ లక్ష్యాలను ప్రభుత్వం అందుకోలేకపోయిందని కాగ్ స్పష్టం చేసింది. 

2021 నవంబరులో ఢిల్లీ సర్కారు తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ప్రకంపనలు సృష్టించింది. ఇందులో అవినీతి జరిగిందంటూ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టడం... ఆప్ ప్రభుత్వ పెద్దలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా జైలుకు వెళ్లడం తెలిసిందే.


More Telugu News