రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశాం: చంద్రబాబు

  • రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామన్న చంద్రబాబు
  • నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
  • రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్న సీఎం
కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు. తమను నమ్మిన ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహిస్తున్న నరెడ్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని అన్నారు. 

భూ సమస్యలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని విధంగా దరఖాస్తులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి కారణమని మండిపడ్డారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని అన్నారు.

టీడీఆర్ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు... నష్టపోయింది ఇంకొకరని చంద్రబాబు చెప్పారు. దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారని... అవినీతికి పాల్పడ్డవారిని వదలిపెట్టబోమని... అమాయకుల్ని కాపాడతామని తెలిపారు. అమరావతి పనులను రూ.50 వేల కోట్లతో ప్రారంభిస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది అన్నారు. 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా పెద్దగా అమరావతి చుట్టూ 183 కి.మీ మేర రింగ్‌ రోడ్డుకు ప్లాన్ సిద్ధం చేశామని... అది పూర్తయితే గుంటూరు-అమరావతి పట్టణాలు కలిసిపోతాయని తెలిపారు. దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదని... కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తామని చెప్పారు. ఒక్క అమరావతినే కాదు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.


More Telugu News