వారానికి 90 గంటల పనిపై ఎల్ అండ్ టీ వివరణ.. మరింత దిగజారారన్న దీపికా పదుకొణె

  • ఎల్ అడ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై నటి అసహనం
  • మానసిక ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దీపిక పోస్ట్
వారానికి 90 గంటలు ఆఫీసులోనే పనిచేయాలని, వారాంతాలు సెలవు తీసుకోవద్దని అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా విమర్శలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఈ పోస్ట్ పై స్పందించారు. సుబ్రహ్మణ్యం పోస్ట్ ను షేర్ చేస్తూ.. ‘ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యా’ అని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం కూడా చూసుకోవాలని చెబుతూ ‘మెంటల్ హెల్త్ మ్యాటర్స్’ హ్యాష్ ట్యాగ్ ను జోడించి పోస్ట్ పెట్టారు.

దీపిక పోస్ట్ పై ఎల్ అండ్ టీ స్పందించింది. ‘8 దశాబ్దాలుగా జాతి నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఎల్‌ అండ్‌ టీ పనిచేస్తోంది. భారత మౌలిక వసతులు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరిచింది. దేశం అభివృద్ధి చెందాలంటే, అసాధారణ లక్ష్యాలను చేరాలంటే తప్పకుండా అసాధారణ కృషి కావాలి. ఈ విస్తృత లక్ష్యాన్నే ఛైర్మన్‌ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయి’ అంటూ కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ వివరణపైనా దీపిక మండిపడింది. ఈ వివరణ ఇవ్వడం ద్వారా మరింత దిగజారారు అంటూ మరో పోస్ట్ పెట్టింది. 

ఎల్ అండ్ టీ చైర్మన్ పోస్ట్ ఇదే..
‘భార్యల ముఖం భర్తలు, భర్తల ముఖం భార్యలు చూసుకుంటూ ఇంట్లో ఎంతకాలం కూర్చుంటారు? ఆఫీసులకు వెళ్లండి, పని చేయడం మొదలుపెట్టండి. ప్రపంచంలోనే నువ్వు టాప్ గా నిలబడాలని అనుకుంటే వారానికి 90 గంటలు నువ్వు పనిచేయాల్సిందే’ అంటూ సుబ్రహ్మణ్యం ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.


More Telugu News