ఏపీ యువత నైపుణ్యాల మెరుగుదలకు ఇన్ఫోసిస్ ఉచిత సహకారం.. కుదిరిన కీలక ఒప్పందం

  • స్కిల్ సెన్సస్ ప్రీ-వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు
  • ఇన్ఫోసిస్ చొరవ అభినందనీయమన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి
  • ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా సహకారం అందించనున్న టెక్ దిగ్గజం
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా రూపుదిద్దేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఎటువంటి ఆర్థిక వనరులతోనూ సంబంధం లేకుండానే  స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి నైపుణ్యాలను అందించనుంది. 

ఇందుకోసం ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రీ-వాలిడేషన్‌కు సహకారం అందించేందుకు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రశంసించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం హర్షణీయమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్, తిరుమల, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్నతాధికారులు గణేష్ కుమార్, దినేష్ కుమార్, రఘు పాల్గొన్నారు. 

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లతో నేర్చుకోవడం సులభం
డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ లెర్నింగ్ పాత్‌వేస్‌కు విద్యార్థులను కనెక్ట్ చేసే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లను సృష్టించనుంది. దీంతో, నిరంతర అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. పరిశ్రమ అవసరాలను తీర్చడానికి ఏపీఎస్ఎస్‌డీసీకి సహకరిస్తుంది. ఔత్సాహికులకు ఉచితంగా నేర్చుకునే అవకాశాలను కల్పించడం, సాంకేతికత అభివృద్ధి, డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్వహణను ఇన్ఫోసిస్ చేపడుతుంది. అభ్యర్థుల నైపుణ్యాలను సమర్థవంతంగా అంచనా వేయడానికి ‘జనరేటివ్ ఇన్ఫోసిస్ డిజిటల్ ప్లాట్ ఫామ్’ను అభివృద్ధి చేసి అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ పరిశ్రమలలో అవసరమైన నైపుణ్యాలను సూచిస్తుంది. తద్వారా అభ్యర్థుల ప్రస్తుత నైపుణ్య స్థాయులను అంచనా వేసి పెంచుకోవాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెడతారు. ప్రాథమిక అంచనాను బట్టి అభ్యర్థుల తదుపరి మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలను సిఫార్సు చేస్తారు.

ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు, వర్క్‌షాప్‌లు
ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్ ‘స్ప్రింగ్‌బోర్డ్’ ప్లాట్‌ఫామ్‌లో క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్‌వేస్‌తో ఔత్సాహికులు కనెక్ట్ కావొచ్చు. దీని ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి నైపుణ్యాలను అంచనా వేస్తారు. తద్వారా నైపుణ్యాలు, కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతర నైపుణ్యాభివృద్ధి కోసం ఇన్ఫోసిస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఇన్ఫోసిస్ పారదర్శకంగా, డేటా ఆధారిత ఫలితాలను నిర్ధారిస్తూ నైపుణ్య అంచనాల పురోగతి, ఫలితాలను ట్రాక్ చేస్తుంది. రాష్ట్రంలో 15-59 సంవత్సరాల మధ్య వయసుగల 3.59 కోట్ల మంది ఇన్ఫోసిస్ ప్రీ-వాలిడేషన్ ద్వారా శిక్షణ పొందవచ్చు. అంతేకాదు, ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఫ్రేమ్‌వర్క్,  స్కిల్ అప్లికేషన్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏకీకరణ సులభతరం అవుతుంది.


More Telugu News