గేమ్‌ ఛేంజర్‌ మూవీలో చిన్న మార్పు.. షాక్‌లో ఫ్యాన్స్!

  • ‘నానా హైరానా’ సాంగ్‌ని తాత్కాలికంగా తొలగించిన చిత్ర యూనిట్
  • జనవరి 14 నుంచి జోడించనున్నట్టు ప్రకటన
  • సాంకేతిక కారణాలతో తొలగిస్తున్నట్టు వెల్లడి
  • మెలోడీ సాంగ్ లేకపోవడంతో నిరాశకు గురవుతున్న చెర్రీ ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో, కియారా అద్వానీ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ వంటి అగ్రనటులు కీలక పాత్రల్లో నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ ఇవాళ (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లపై విడుదలై మిక్స్‌డ్ టాక్‌‌తో దూసుకెళుతోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో చెర్రీ అద్భుతంగా నటించాడని, బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే, ఒక విషయంలో మాత్రం రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అదేంటంటే...  చిత్రంలోని అద్భుతమైన ‘నానా హైరానా’ అనే మెలోడి సాంగ్‌ను చిత్రబృందం తాత్కాలికంగా తొలగించింది. అనివార్యమైన కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది. ‘‘ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో అందరికీ ఇష్టమైన ‘నానా హైరానా’ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తాం. ఇందుకోసం చిత్ర బృందం రాత్రి, పగలు కృషి చేస్తోంది’’ అని చిత్ర బృందం వివరించింది.

ఊహించని ఈ మార్పుతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్‌తో అలరించిన పాట సినిమాలో ప్రస్తుతానికి లేకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. అయినా ఏం పర్లేదు జనవరి 14 నుంచి థియేటర్లలో ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు.



More Telugu News