ఈ లక్షణాలు కనిపిస్తే... మైగ్రేన్ సమస్య​ ముంచుకొస్తున్నట్టే!

  • కణతల వద్ద ఒకవైపుగానీ, రెండు వైపులగానీ తీవ్రంగా వచ్చే తలనొప్పి మైగ్రేన్
  • ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది
  • ముందే గుర్తించి జాగ్రత్తపడవచ్చని చెబుతున్న నిపుణులు
మైగ్రేన్... తీవ్రమైన తలనొప్పి. కణతల వద్ద నుంచి కళ్ల వెనుకగా ఏదో ఒక ఒకవైపుగానీ, తలలో రెండు వైపులగానీ ఈ మైగ్రేన్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఒక్కోసారి గంటా రెండు గంటలకే నొప్పి తగ్గిపోయినా, మెల్లగా అది ఇబ్బంది పెట్టే సమయం పెరుగుతుంది. కొందరిలో రోజులకు రోజులు కొనసాగుతుంది. ఈ మైగ్రేన్ వల్ల ఏ పనిపైనా దృష్టిపెట్టలేరు. నిద్ర సరిగా పట్టదు. ఆహారం కూడా సరిగా తీసుకోలేనంత ఇబ్బంది ఉంటుంది. ఇంతగా ఇబ్బంది పెట్టే మైగ్రేన్ సమస్యను కొన్ని లక్షణాల ఆధారంగా ముందే గుర్తించి, తగిన చికిత్స చేయించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నీరసం... విపరీతంగా ఆవలింతలు
ఉన్నట్టుండి ఆరోగ్యంలో మార్పులు వచ్చి... నీరసంగా అనిపిస్తుండటం, తరచూ ఆవలింతలు ఎక్కువగా వస్తుండటం వంటివి మైగ్రేన్ తలనొప్పికి ముందస్తు లక్షణాలు అని నిపుణులు చెబుతున్నారు.

పొడుస్తున్నట్టుగా ఉండే తలనొప్పి...
తరచూ కాసింత హెచ్చుతగ్గులతో, పొడుస్తున్నట్టుగా ఉండే తలనొప్పి వస్తుండటం కూడా మైగ్రేన్ దాడికి ముందస్తు సూచన అని నిపుణులు చెబుతున్నారు. ఇది మరీ ఇబ్బందిగా ఏమీ ఉండదని, అలాగని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.

వికారం, వాంతులు...

మైగ్రేన్ తలనొప్పి దాడికి ముందు వికారంగా ఉన్న భావన కలుగుతుందని, కొన్నిసార్లు, కొందరిలో వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాంతి రాకున్నా... వచ్చినట్టుగా ఫీలింగ్ ఉంటుందని వివరిస్తున్నారు.

వెలుతురును, ధ్వనిని తట్టుకోలేకపోవడం...
వెలుతురు, చప్పుళ్లు కాస్త ఎక్కువైనా తట్టుకోలేకపోవడం, ఏదో ఇబ్బందిగా ఫీలవడం కూడా మైగ్రేన్ కు ముందస్తు లక్షణాలు అని నిపుణులు వివరిస్తున్నారు. 

తరచూ మూడ్ మారిపోవడం...
పెద్దగా కారణమేదీ లేకపోయినా చిరాకుగా ఉండటం, డిప్రెషన్, ఒక్కసారిగా యాక్టివ్ గా మారిపోవడం వంటి మానసిక మార్పులు (మూడ్ చేంజ్) తరచూ కనిపిస్తుండటం కూడా మైగ్రేన్ కు ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు.

మెడపట్టేసినట్టుగా, నొప్పిగా ఉండటం...
మెడ వద్ద పట్టేసినట్టుగా ఉండటం, నొప్పిగా అనిపించడం కూడా ఒక్కోసారి మైగ్రేన్ దాడి చేయబోతోందనే దానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు.

కళ్ల ముందు చిత్రమైన దృశ్యాలు...

కళ్ల ముందు ఏవో ఫ్లాష్ లైట్లు వెలిగినట్టుగా అనిపించడం, ఏవేవో వంకర టింకర లైన్లు లేదా నల్లటి మచ్చల్లా కనిపించడం వంటివి కూడా మైగ్రేన్ దాడికి ముందు కనిపించే లక్షణాలు అని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఈ అంశాలు గుర్తుంచుకోండి
పైన చెప్పిన లక్షణాలన్నీ మైగ్రేన్ కు సంబంధించి ఆరోగ్య నిపుణులు వెల్లడించినవి. ఆయా లక్షణాలు వేరే ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలకు కూడా సూచిక కావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఈ సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.


More Telugu News