ఆసీస్ టూర్ నుంచి తిరిగొచ్చిన నితీశ్ రెడ్డికి విశాఖ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

  • ఆస్ట్రేలియా టూర్లో అంచనాలకు మించి రాణించిన నితీశ్ కుమార్
  • సెంచరీ సహా 289 పరుగులు చేసిన ఆంధ్రా యువకిశోరం
  • బౌలింగ్ లోనూ 5 వికెట్లు తీసిన వైనం
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి అంచనాలకు మించి రాణించిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ టెస్టులో సాధించిన వీరోచిత శతకం (114) నితీశ్ కుమార్ రెడ్డి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. మొత్తమ్మీద ఈ సిరీస్ లో ఐదు టెస్టుల్లో నితీశ్ 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో నితీశ్ రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు, బౌలింగ్ లోనూ 5 వికెట్లు తీశాడు. 

ఇక, ఆసీస్ టూర్ నుంచి తిరిగొచ్చిన నితీశ్ కు సొంతగడ్డ విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో నితీశ్ కుమార్ పై అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్రత్యేక వాహనంలో ఎక్కిన ఈ డాషింగ్ ఆల్ రౌండర్ ఊరేగింపుగా తన నివాసానికి చేరుకున్నాడు. ఓపెన్ టాప్ జీప్ లో ముందు సీట్లో నితీశ్ కూర్చోగా, వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. నితీశ్ నివాసం గాజువాకలో ఉంది. ఎయిర్ పోర్టు నుంచి గాజువాక వరకు అభిమానులు తీన్ మార్ వాయిద్యాల నడుమ నితీశ్ ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. 



More Telugu News