తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు: సీఎం చంద్రబాబు

  • తిరుపతిలో తొక్కిసలాట
  • తిరుపతిలో చంద్రబాబు ప్రెస్ మీట్
  • ఇకనైనా అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు
తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగి శ్రీవారి భక్తులు మరణించన వార్త కలచివేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో బుధవారం నాడు ప్రధానమంత్రి రూ. 2.8 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని, ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఈ విషాద వార్త విని మనసు వేదనకు గురైందని తెలిపారు. 

తిరుమల కొండపై ఇంతటి విషాదం జరగడం తనను ఎంతో బాధిస్తోందని, తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు విడిచారని వెల్లడించారు. లావణ్య(విశాఖ), శాంతి(విశాఖ), నాయుడు బాబు(నర్సీపట్నం), రజనీ(విశాఖ),  నిర్మల (కోయంబత్తూర్), మల్లిక(మెట్టు సేలం) భక్తులు మరణించారని వివరించారు. వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

 "టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, జేఈవో సహా కొండపై అందరూ సమన్వయంతో పనిచేయాలి. దేవుని పవిత్రతకు భంగం కలిగించకూడదు. పెత్తందార్లుగా కాకుండా సేవకులుగా దేవుని సేవలో పాల్గొనాలి. తిరుమల పవిత్రతను కాపాడతానని మరోసారి చెబుతున్నాము. 

45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 23 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంది. తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారని నాకు కూడా తెలియదు. అక్కడ మరిన్ని జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఉన్న తృప్తి... తిరుపతిలో రాదని భక్తులు అంటున్నారు. గత ఐదేళ్లలో కొండపై చాలా అరాచకాలు జరిగాయి. కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తిరుమలకు వచ్చినప్పుడు నేను సామాన్య భక్తుడిగానే ఉంటా. వైకుంఠ ఏకాదశికి ఎన్ని టికెట్లు ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

"వెంకటేశ్వరుని సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదు. తిరుమల పవిత్రతను నిలబెట్టడం ఒక భక్తుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఈ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. మనం చేసిన పనుల వల్ల దేవుని పవిత్రత దెబ్బతినకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. 

రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్రిస్టియన్లు జెరూసలేం, ముస్లింలు మక్కాకు వెళ్తారు. హిందువులు తిరుమల కొండకు వస్తారు. జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం’ అని సీఎం అన్నారు.  





More Telugu News