అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం: తిరుపతిలో పవన్ కల్యాణ్

  • తిరుపతిలో తొక్కిసలాట
  • ఆరుగురు భక్తుల మృతి
  • నేడు తిరుపతి వచ్చి ఘటన స్థలిని పరిశీలించిన పవన్
  • అధికారుల తీరుపై ఆగ్రహం 
  • పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం
తిరుపతిలోని బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తినాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులు చేసిన తప్పులు ప్రభుత్వాలపై పడుతున్నాయని... తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, ఘటన స్థలి వద్ద ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ఘటన స్థలం వద్ద టీటీడీ సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు... అంతమంది ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందని అన్నారు. టీటీడీ ఇకనైనా వీఐపీల గురించి కాకుండా, సామాన్య భక్తులపై దృష్టి  పెట్టాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి టీటీడీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని అన్నారు. 

ఏదేమైనా గానీ, తిరుపతిలో తప్పు జరిగిందని, అందుకు గాను మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి, శ్రీవారి భక్తులకు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెబుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఇవాళ పవన్ కల్యాణ్ తిరుపతిలో తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కును పరిశీలించారు. స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా కలుగుతున్నాయని, పోలీసుల్లో ఎవరైనా కావాలనే ఇలా చేశారా? అని సందేహంగా ఉందని అన్నారు. పోలీసుల అలసత్వంపై ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి వివరిస్తానని తెలిపారు. 

తిరుపతిలో భారీ ఎత్తున వచ్చిన భక్తులను నియంత్రించే విధానం సరిగాలేదని, తొక్కిసలాట వంటి ఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న దానికి కూడా సరైన ప్రణాళిక లేదని పవన్ విమర్శించారు.


More Telugu News