తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ

  • తిరుపతిలో విషాదం
  • టోకెన్ జారీ కేంద్రాల వద్ద ఆరుగురి మృతి
  • క్షతగాత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు 
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. క్షతగాత్రులకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఇవాళ తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారిని అడిగి తొక్కిసలాట వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న ఆ భక్తులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. భక్తులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

అనంతరం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, బాధితులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.


More Telugu News