తిరుపతి తొక్కిసలాట ఘటన... చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

  • చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా
  • చంద్రబాబు, బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
  • పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్న
టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుందని చెప్పారు. చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. 

సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేకపోయినా ఆయనపై కేసు పెట్టారని... ఈ ఘటనలో చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. సనాతన యోధుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతమంది చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఎక్కడున్నారని అడిగారు. పీఠాధిపతులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.


More Telugu News