గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని నిందితుడి కోసం వెళ్లి.. నాగాలాండ్‌లో బందీలుగా మారిన అసోం పోలీసు బృందం

  • ఆయుధాలతో ఉన్న పోలీసులను చూసి దుండగులుగా భావించిన స్థానికులు
  • దాడిలో ఒక పోలీసుకు గాయాలు
  • పట్టుకుని రాతంత్రా బందీలుగా ఉంచుకున్న వైనం
  • విషయం తెలిసి రక్షించిన నాగాలాండ్ పోలీసులు
నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న అసోం పోలీసులకు దారుణ పరాభవం ఎదురైంది. గూగుల్ మ్యాప్‌ను అనుసరించిన పోలీసులు నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లా చేరుకున్నారు. వీరిని చూసిన స్థానికులు అనుమానించి దాడి చేయడమే కాకుండా రాతంత్రా బందీలుగా ఉంచుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన.

అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే, వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. 

విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది.

గూగుల్ మ్యాప్స్ జనాన్ని తప్పుదారి పట్టించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో బీహార్ నుంచి గోవాకు బయలుదేరిన ఓ కుటుంబం కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్ తాలూకాలోని దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తూ కిందనున్న నదిలో పడి మృతి చెందారు.  


More Telugu News