తిరుపతి తొక్కిసలాటపై ప్రధాని మోదీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి

  • తొక్కిసలాట ఘటన బాధించిందన్న ప్రధాని మోదీ
  • తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన జైశంకర్
  • తీవ్రంగా కలచివేసిందన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్
ఏపీలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది బాధాకర ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎక్స్ వేదికగా స్పందించిన జైశంకర్

తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తీవ్రంగా కలచివేసింది: తెలంగాణ సీఎం

తిరుమల  వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వారి మృతికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

దిగ్భ్రాంతికరం: కిషన్ రెడ్డి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

బండి సంజయ్ దిగ్భ్రాంతి

తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.


More Telugu News