ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాకు మద్దతు ప్రకటించారు... థ్యాంక్యూ దీదీ: కేజ్రీవాల్

  • మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీకి ధన్యవాదాలు అంటూ కేజ్రీవాల్ ట్వీట్
  • మంచి, చెడు సమయాల్లో మీరు మాకు మద్దతిచ్చారని వ్యాఖ్య
  • కేజ్రీవాల్‌కు ఇప్పటికే సమాజ్ వాది, శివసేన (యూబీటీ) మద్దతు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తమకు మద్దతు ప్రకటించినందుకు 'థ్యాంక్యూ దీదీ' అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఎల్లుండి నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. అంతేకాదు, ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో వీరంతా కలిసి బీజేపీపై పోటీ చేశారు. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్‌లు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి టీఎంసీ మద్దతు ప్రకటించింది. మమతా దీదీకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ధన్యవాదాలు దీదీ. మా మంచి, చెడు సమయాల్లో మీరు ఎల్లప్పుడూ మాకు మద్దతిచ్చారు. మమల్ని ఆశీర్వదించారు" అని పోస్ట్ పెట్టారు.

ఇండియా కూటమిలోని మెజార్టీ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతును ప్రకటించాయి. సమాజ్‌వాది పార్టీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కూడా కేజ్రీవాల్ పార్టీకే మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నుంచి అధికారంలో ఉంది.


More Telugu News