బీర్ల ధరలను 33 శాతం పెంచాలని యూబీ కోరుతోంది... అలా పెంచితే వారికి భారం: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • మద్యం ధరలు పెంచితే భారం పడుతుందన్న మంత్రి
  • పెంపుపై రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడి
  • నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి
  • బీర్ల ధరలు రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి... అలాగే ఉండేలా చూస్తామన్న మంత్రి
బీర్ల ధరలను 33.1 శాతం పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కోరుతోందని, ధరలు అంతలా పెంచితే మద్యం కొనుగోలు చేసే వారిపై పెద్ద మొత్తంలో భారం పడుతుందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మద్యం ధరల పెంపుపై రిటైర్డ్ జడ్జితో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరినట్లు చెప్పారు. ఆ నివేదిక వచ్చాక ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి వెళ్లిందని, వాటికి నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీని చెల్లిస్తున్నట్లు చెప్పారు. మరో రూ.40 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించినవి రూ.2,500 కోట్లు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక వీటిలో రూ.1,139 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. 

యూబీ బీర్లకు సంబంధించి రాష్ట్రంలో 14 లక్షల కేసుల స్టాక్ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో బీర్ల ధరలు తక్కువగా ఉన్నాయని, మన వద్ద ఎప్పుడూ ధరలు తక్కువే ఉండేలా చూస్తామన్నారు. కర్ణాటకలో బీరు రూ.190, ఆంధ్రప్రదేశ్‌లో రూ.180 ఉండగా, తమిళనాడు, తెలంగాణలలోనే రూ.150గా ఉందన్నారు. ధరలు పెంచాలన్న యూబీ ఒత్తిడికి తలొగ్గేది లేదన్నారు.


More Telugu News