నేనే తప్పు చేయలేదు... ఎలాంటి విచారణకైనా సిద్ధమే: కేటీఆర్

  • భారత న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్న కేటీఆర్
  • కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ ఎదుట హాజరయ్యానన్న కేటీఆర్
  • హైకోర్టు అనుమతిస్తే న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతానన్న కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసులో తాను తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని... భారత న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన మాట్లాడుతూ... తనపై పెట్టిన కేసు కక్ష సాధింపు చర్య అని తెలిసినా ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యానన్నారు.

తనపై పెట్టింది అక్రమ కేసు అని, రాజకీయ ప్రేరేపితమైనదన్నారు. అవినీతిపరులకు ఇతరులు ఏం చేసినా అవినీతిగానే కనిపిస్తుందన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో పైసా అవినీతి జరగలేదన్నారు. తెలంగాణ ఇమేజ్‌ను పెంచేందుకే పార్ములా ఈ-రేస్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై కేసు పెట్టారని ఆరోపించారు.

తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరవుతానంటే వద్దని చెబుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు అనుమతిస్తే తమ న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానన్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నానన్నారు. ఏసీబీ అధికారులు తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పార్టీకి చెందిన పట్నం నరేందర్ రెడ్డి విచారణలో ఇవ్వని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు చెప్పారని, తన న్యాయవాది రాకుంటే తన విషయంలోనూ అలాగే చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ కోరామన్నారు. చివరకు న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

మంత్రి పొంగులేటి తనపై విమర్శలు చేయడాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... కేటీఆర్ స్పందించారు. పాపం ఆయనకు కొత్తగా మంత్రి పదవి రావడంతో ఆ ఉత్సాహంతో ఆగడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరి వద్ద రియల్ ఎస్టేట్ భూములు లాక్కున్నారు, ఏయే భూములు 30 శాతం నుంచి 40 శాతం రాయించుకున్నారో అన్నీ బయటకు వస్తాయన్నారు.


More Telugu News