కందుల జాహ్నవి మృతికి కారకుడైన సియాటెల్ పోలీసు అధికారి తొలగింపు

  • 2023లో యూఎస్‌లో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని చనిపోయిన జాహ్నవి
  • అందుకు కారణమైన అధికారి కెవిన్ డేవ్‌ను తొలగిస్తూ ప్రకటన
  • మరో వ్యక్తిని కాపాడే సదుద్దేశమే.. అయినా జాహ్నవి విషాద పరిణామాన్ని సమర్థించలేమన్న ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి అనే విద్యార్థిని 2023 జనవరిలో అమెరికాలోని సియాటెల్‌లో ఓ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు కారణమైన అధికారి కెవిన్ డేవ్‌ను పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి తొలగిస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన ఓ బాధితురాలిని కాపాడే సదుద్దేశంతోనే కారుని వేగంగా నడిపినప్పటికీ, ప్రమాదకర డ్రైవింగ్ దారితీసిన విషాద పరిణామాన్ని సమర్థించలేమని, అతడి నిర్ణయం కారణంగా ఒక నిండు ప్రాణం పోయిందని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రార్ వివరించారు.

కెవిన్ డేవ్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నాలుగు నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించామని, అందుకే అతడిని తొలగిస్తున్నట్టు మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసిన సమాచారంలో సూ రార్ పేర్కొన్నారు. కెవిన్ డేవ్ కారణంగా సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అపకీర్తిపాలైందని ఆమె వ్యాఖ్యానించారు.  

కాగా, కందుల జాహ్నవి 2023 జనవరి 23న సీయాటెల్‌లోని ఒక వీధిని దాటుతున్న సమయంలో కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. గంటకు 119 కి.మీ. వేగంతో దూసుకొచ్చి ఢీకొనడంతో ఆమె దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడింది. ఈ వ్యవహారంలో డేనియల్‌ అడెరెర్‌ అనే పోలీసు అధికారిని కూడా ఉద్యోగం నుంచి ఇప్పటికే తొలగించారు. జాహ్నవి మృతిని అవహేళన చేస్తూ అతడు నవ్వాడు. డెడ్‌బాడీ వద్దకు వెళ్లి చూసిన సమయంలో.. ‘ఓ సాధారణ వ్యక్తి.. ఈ చావుకు విలువలేదు’ అని అన్నాడు. ఈ మాటలు ‌బాడీక్యామ్‌లో రికార్డ్ కావడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అధికారులు విచారణ జరిపి అతడిపై తొలగిస్తూ వేటు వేశారు.


More Telugu News