నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం

  • ఉదయం 6.35 గంటల ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్ర నమోదు
  • భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు
  • పొరుగునే ఉన్న చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌పైనా ప్రభావం
భారీ భూకంపం ఒకటి ఈ ఉదయం నేపాల్‌ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఉదయం 6.35 గంటల సమయంలో భూమి కంపించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్ రాజధాని కఠ్మాండూతోపాటు పలు జిల్లాల్లో ప్రకంపనలు కనిపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా సంభవించిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపైనా పడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే, చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాగా, 2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


More Telugu News