గుండెపోటుతో తరగతి గదిలోనే మూడో తరగతి బాలిక మృత్యువాత

గుండెపోటుతో తరగతి గదిలోనే మూడో తరగతి బాలిక మృత్యువాత
  • కర్ణాటకలోని చామరాజనగరలో ఘటన
  • తరగతి గదిలో టీచర్‌కు నోట్‌బుక్ చూపిస్తూ కుప్పకూలిన బాలిక
  • కొవిడ్-19 తర్వాత పెరిగిన గుండెపోటు మరణాలు
ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు సర్వసాధారణంగా మారాయి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రాణాలు హరిస్తున్నాయి. తాజాగా మూడో తరగతి చదువుతున్న బాలిక తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. కర్ణాటక, చామరాజనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో జరిగిందీ ఘటన.

8 ఏళ్ల తేజస్విని మూడో తరగతి చదువుతోంది. నిన్న తరగతి గదిలో టీచర్‌కు నోట్‌బుక్ చూపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని జేఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. 

కాగా, గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్లో ఆటలు ప్రాక్టీస్ చేస్తుండగా నాలుగేళ్ల కుర్రాడు గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతకుముందు సెప్టెంబర్‌లో అదే రాష్ట్రంలోని లక్నోలో 9 ఏళ్ల బాలిక స్కూల్ ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కాగా, కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగినట్టు వోకార్డ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత రెండు నెలలుగా 15 నుంచి 20 శాతం అధికంగా ఇలాంటి కేసులు వస్తున్నట్టు పేర్కొన్నాయి.


More Telugu News