పెళ్లాలకు అల్జీమర్స్ వచ్చినా ఫ్లాష్ బ్యాక్ లు మాత్రం మర్చిపోరు: విక్టరీ వెంకటేశ్

  • నిజామాబాద్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన చిత్రబృందం
  • ఆసక్తికరంగా ప్రసంగించిన 'వెంకీ మామా'
విక్టరీ వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయినర్ చిత్రం... సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తోంది. నేడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిజామాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 

హీరో వెంకటేశ్ మాట్లాడుతూ... ఈ ఈవెంట్ కు వచ్చిన జనం మధ్యకు వచ్చి మటన్ తింటూ, కల్లు తాగుతూ సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తోందని అన్నారు. అయితే, తాను ఆవిధంగా రాలేను కాబట్టి... అందరూ తాను వచ్చినట్టే ఊహించుకుని ఎంజాయ్ చేయాలని సరదాగా వ్యాఖ్యానించారు. 

"నిజామాబాద్ లో మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది. నాపై మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేమ చూపిస్తూ, నా సినిమాలు సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఏవీ (AV) చూశాను... నాకే గుర్తులేదు కానీ చాలా హిట్లు వచ్చాయి... థాంక్యూ సో మచ్. బొబ్బిలి రాజా, పెళ్లికాని ప్రసాదు, వెంకీ మామా, గణేశ్, చంటి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఎఫ్2, దృశ్యం, నారప్ప వరకు అనేక చిత్రాలు, పాత్రలు నా కెరీర్ లో ఉన్నాయి. 

ఇప్పుడు నేను నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసేందుకు మీరు మీ కుటుంబం మొత్తంతో కలిసి రావాలి. తప్పకుండా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదం, ఎక్సట్రార్డినరీ సాంగ్స్, సూపర్బ్ యాక్షన్, సూపర్బ్ డైలాగ్స్... ఓవరాల్ ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రం ఇది. దిల్ రాజు వాళ్ల బ్యానర్ లో నాలుగు చిత్రాలు చేశాను. అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. ఆయన బ్యానర్లో మరెన్నో చిత్రాలు చేయాలనుకుంటున్నాను. 

ఈ సినిమాలో ఐశ్వర్య నా భార్యగా, మీనాక్షి నా ప్రేయసిగా నటించారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి... పెళ్లాలకు అల్జీమర్స్ జబ్బు వచ్చినా ఫ్లాష్ బ్యాక్ లు మాత్రం మర్చిపోరు. దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్ లు పెళ్లాలకు చెప్పొద్దు. బజ్జీ అయిపోతారు... ఉతికేస్తారు... చాలా జాగ్రత్తగా ఉండండి" అంటూ వెంకీ తనదైన శైలిలో కామెడీగా చెప్పారు.


More Telugu News