ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది.. గౌతీ వ‌చ్చిన త‌ర్వాతే గేమ్ చేంజ్ అయింది: హర్భజన్ సింగ్

  • గత ఆరు నెలల్లో టీమిండియా ఘోర వైఫ‌ల్యంపై మాజీ స్పిన్న‌ర్ ఆవేద‌న‌
  • భారత్ 'సూపర్ స్టార్' సంస్కృతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య‌
  • ఆట‌గాళ్ల ఖ్యాతి ఆధారంగా కాకుండా.. వారి ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జ‌ట్టులో ఉండాల‌న్న భ‌జ్జీ
టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి భారత జ‌ట్టు కీల‌క సిరీస్‌ల‌లో ప‌రాభ‌వం ఎదుర్కొంది. మొదట శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి పాలైంది. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోయింది. 

అటు భారత జట్టులోని సీనియ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో సహా ప‌లువురు కీల‌క‌ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆట‌ను ఆడ‌టంలో విఫలమయ్యారు. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది... ఆయ‌న ప‌ద‌వీకాలం ముగిసిన తర్వాత ఏమైందంటూ భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్ర‌శ్నించాడు. 

"రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ ప్రపంచకప్ గెలిచింది. అయితే అకస్మాత్తుగా ఏం జరిగింది? గత ఆరు నెలల్లో మ‌నం శ్రీలంక చేతిలో ఓడిపోయాం. న్యూజిలాండ్‌తో సిరీస్ వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 3-1 తేడాతో సిరీస్‌ ఓటమి. అంతా పడిపోయినట్లు కనిపిస్తోంది" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ అన్నాడు.

"ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌కు అతిపెద్ద ప్రతికూలత సీనియర్ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల ప్రదర్శన. వారు జట్టు నుంచి నిష్క్రమించాలనే పిలుపులు తీవ్రమవుతున్నందున, భారత్ 'సూపర్ స్టార్' సంస్కృతికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది" అని హర్భజన్ వ్యాఖ్యానించాడు.

"ప్రతి ఆటగాడికి ఖ్యాతి ఉంటుంది. ఇలాగే చూసుకుంటూ పోతే కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే... ఇలా టీమిండియాకు చాలా మంది మ్యాచ్ విన్నర్‌లు ఉన్నారు. బీసీసీఐ, సెలెక్టర్లు పట్టు సాధించాలి. సూపర్ స్టార్ వైఖరిని భారత్ వదిలివేయాలి" అని అతను చెప్పాడు. 

ఎంతో నైపుణ్యం క‌లిగిన‌ అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి రంజీ ఆట‌గాళ్లను ఆస్ట్రేలియాలో తమను తాము పరీక్షించుకునే అవకాశం ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల కూడా మాజీ స్పిన్నర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 

"అభిమన్యు ఈశ్వరన్‌ను టూర్‌కు తీసుకెళ్లారు. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతనికి అవకాశం ఇస్తే అతను భారత జ‌ట్టుకు కీల‌క‌ ఆటగాడు అవుతాడు. సర్ఫరాజ్‌దీ అదే ప‌రిస్థితి. మంచి ప్రదర్శన చేసే ఆటగాళ్లు జ‌ట్టులో ఉండాలి. కేవ‌లం ఖ్యాతి ఉన్న ఆటగాళ్ల‌ను ఎంపిక చేయకూడదు” అని హర్భజన్ పేర్కొన్నాడు.

రోహిత్, కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడానికి సిద్ధంగా లేకపోయినా, సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హర్భజన్ తెలిపాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు నిర్ణయించుకోవాలి" అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.




More Telugu News