'నా ఆత్మ‌గౌర‌వంపై దాడి జ‌రిగింది'.. బోరున ఏడ్చేసిన మాధ‌వీల‌త‌.. వైర‌ల్ వీడియో!

  • ఏడుస్తూ సోష‌ల్ మీడియాలో వీడియో పెట్టిన మాధ‌వీల‌త‌  
  • తాను ఎవ‌రికీ ద్రోహం చేయ‌లేద‌న్న హీరోయిన్‌  
  • క‌క్ష‌గ‌ట్టి మాట‌లు అంటున్నార‌ని ఆవేద‌న‌
  • ఆడిపిల్ల‌గా సింప‌థీ గేమ్ ఆడ‌కుండా మ‌గాడిలా పోరాడుతున్నాన‌న్న న‌టి
న‌టి, బీజేపీ నేత మాధ‌వీల‌త ఏడుస్తూ సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. త‌న ఆత్మ‌గౌర‌వంపై దాడి జ‌రిగిందంటూ ఆమె బోరున ఏడ్చేశారు. తాను ఎవ‌రికీ ద్రోహం చేయ‌లేద‌ని, క‌క్ష‌గ‌ట్టి మాట‌లు అంటున్నార‌ని ఆమె పేర్కొన్నారు. ఆడిపిల్ల‌గా సింప‌థీ గేమ్ ఆడ‌కుండా మ‌గాడిలా పోరాడుతూనే ఉన్నాన‌ని తెలిపారు. ఈ క‌ష్టాల‌ను అధిగ‌మిస్తాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. 

"చాలా ప్రయత్నం చేశా. కానీ నేనూ మనిషినే. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడితో నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం... అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న. 

నా పార్టీ కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు. ఎవరికి ద్రోహం చేసింది లేదు. మోసం చేసింది లేదు. కానీ కక్షగట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎపుడు నేను సింప‌థీ గేమ్ ఆడలేదు. మ‌హిళ అనుకూల చ‌ట్టాల‌ను   ఉపయోగించలేదు. 

మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమ అభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి" అంటూ మాధవీలత వీడియో పోస్ట్ చేశారు. 

కాగా, మాధ‌వీల‌త‌పై తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆమెకు ఎలాంటి గొప్ప పేరు లేద‌ని, ఒక ప్రాస్టిట్యూట్ అని వ్యాఖ్యానించారు. దీంతో జేసీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌ల‌తో పాటు ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

దాంతో తాను ఆ వ్యాఖ్య‌లు చేయాల్సింది కాదంటూ, త‌న మాట‌ల‌కు చింతిస్తూ ఆయ‌న మాధ‌వీల‌త‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయితే, త‌న‌పై వ్యాఖ్య‌లు చేసి జేసీ సారీ చెప్ప‌డంపై ఆమె స్పందించారు. నోటికి వ‌చ్చింది తిట్టి క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోతుందా అని మాధ‌వీల‌త ప్ర‌శ్నించారు. 


More Telugu News