గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ వస్తుండడంతో భారీ ఏర్పాట్లు: మంత్రి కందుల దుర్గేశ్

  • రాజమండ్రిలో నేడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్
  • ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ఏర్పాట్లను పరిశీలించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు రాజమండ్రిలో గ్రాండ్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్వయంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా వాళ్లు, రాజకీయ నేతలు హాజరవుతున్నారు కాబట్టి ఇదొక ముఖ్యమైన ఈవెంట్ అని తెలిపారు. డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి వస్తుండడంతో... జిల్లా కలెక్టర్, ఎస్పీ సూక్ష్మస్థాయి నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని, ఇది చాలా పెద్ద ప్రదేశమని, పైగా నేషనల్ హైవేకి ఆనుకుని ఉందని మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. ఇక్కడ ఎంతమందితో అయినా సభ నిర్వహించవచ్చని, రవాణా కూడా సులభం అవుతుందని తెలిపారు. 

"డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్రహ్మాండమైన క్రేజ్ ఉన్న నాయకుడు. మరోవైపు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్... వీళ్లిద్దరూ వస్తున్నప్పుడు అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అందరి భద్రత ఏర్పాట్లకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ అంశంపై కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఓవైపు భద్రత, మరోవైపు కార్యక్రమం బాగా జరిగిందన్న భావన కలిగించడం... ఈ దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం. 

టైమ్ కూడా మరీ పొడిగించడం కాకుండా... ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తామని నిర్మాత నిన్న నాకు చెప్పారు. సమయం కుదించడం వల్ల, ఈ సభకు వచ్చినవాళ్లు తమ ఇళ్లకు సకాలంలో చేరుకునేందుకు వీలవుతుంది. మొత్తమ్మీద ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాం" అని మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు.


More Telugu News