చంద్రబాబు, లోకేశ్ బాధ్యత కలిగిన వారు కాబట్టి అలాంటి పనులు చేయలేదు: మంత్రి సత్యకుమార్

  • ఏపీలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
  • పాయకాపురం జూనియర్ కాలేజీలో కార్యక్రమానికి లోకేశ్, సత్యకుమార్ హాజరు
  • గతంలో దైవాంశ సంభూతుల్లా పేర్లు పెట్టుకున్నారని సత్యకుమార్ విమర్శలు
ఏపీలో ఇవాళ్టి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనా విధానానికి అనుగుణంగా విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

"ప్రభుత్వ విద్యకు మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారు. జూనియర్ కాలేజిల్లో మధ్యాహ్న భోజన పథకం మొదటిసారిగా అమలుగా చేసున్నది ఏపీలో మాత్రమే. ఇందుకోసం ప్రభుత్వం రూ.90 కోట్లు ఖర్చు చేస్తోంది. 

ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషిచేస్తున్నాం. మార్కెట్లో గుడ్ల రేటు తగ్గినా, వీళ్లు (వైసీపీ) రేటు తగ్గించకుండా గతంలో ఎంతో అవినీతికి పాల్పడ్డారు. గుడ్లపై కూడా స్టాంపు వేసుకున్నారు. వారి పేర్లతో దీవెనలు, కానుకలని పేర్లు పెట్టుకున్నారు. వారి సొంత ఖజానానుంచి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ వారి పేర్లు పెట్టుకున్నారా? బాధ్యత కలిగిన వారు కనుక ఆ పనులు చేయలేదు. 

తల్లిదండ్రులు, గురువు, దేవుడికి మాత్రమే దీవెనలు ఇచ్చే అర్హతలు ఉన్నాయి. తాము దైవాంశ సంభూతులమని ఎవరన్నా అనుకుంటే వారిని దూరంగా ఉంచండి. అటువంటి వ్యక్తులు, శక్తులను దూరంగా పెట్టండి. 

రాష్ట్రంలో యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ సెన్సస్ చేస్తున్నారు. మీ గురించి ఆలోచించే డైనమిక్ మంత్రి (నారా లోకేశ్) ఉన్నారు. నైపుణ్య శిక్షణ ఇచ్చి, రాబోయే రోజుల్లో మీ కాళ్లపై మీరే నిలబడేలా కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తుంది. ఇప్పుడు మనం నాలెడ్జి ప్రాక్టీషనర్స్ గా ఉన్నాం, నాలెడ్జి ప్రొడ్యూసర్స్ గా లేము. రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్స్ గా తయారు కావాల్సి ఉంది. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు ఇక్కడే ఏర్పాటవుతాయి" అని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.

ఇక, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో 34 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ కార్డుల్లో పొందుపరుస్తున్నామని సత్యకుమార్ తెలిపారు. పిల్లలు ఎనీమియా బారిన పడకుండా ఆర్ కె ఎస్ కె కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.

లోకేశ్ ను చూసి నేర్చుకోవాలి: ఎంపీ కేశినేని చిన్ని 

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ... మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నివసించే ప్రాంతంలో మధ్యాహ్న భోజన ప్రారంభించడం హర్షణీయం అన్నారు. 

"స్వర్గీయ ఎన్టీఆర్ నాడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు... ఇవాళ ఆయన మనవడు లోకేశ్ ఇంటర్ విద్యార్థులకు ప్రారంభించడం ఆనందంగా ఉంది. విద్యాశాఖలో అనూహ్య మార్పులు తెస్తున్న లోకేశ్ కు అభినందనలు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సూత్రాన్ని విద్యార్థులంతా లోకేశ్ ను చూసి నేర్చుకోవాలి. ఆయన అమెరికా వెళ్లి గూగుల్, టెస్లా వంటి కంపెనీల చుట్టూ తిరిగారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు" అని కొనియాడారు.




More Telugu News