సిడ్నీ టెస్టు... జైస్వాల్ పేరిట‌ అదిరిపోయే రికార్డు... తొలి భార‌త బ్యాట‌ర్‌గా అరుదైన ఘ‌న‌త‌!

  • టెస్టుల్లో మొద‌టి ఓవ‌ర్‌లోనే అత్య‌ధిక ర‌న్స్‌ కొట్టిన భార‌త బ్యాట‌ర్‌గా జైస్వాల్ రికార్డు
  • రెండో ఇన్నింగ్స్ లో తొలి ఓవ‌ర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో 16 ప‌రుగులు బాదిన ఓపెన‌ర్‌
  • బీజీటీ సిరీస్‌లో 5 టెస్టుల్లో క‌లిపి  391 ప‌రుగులు చేసిన‌ జైస్వాల్
  • తద్వారా తొలి సిరీస్‌లోనే అత్య‌ధిక ర‌న్స్‌ చేసిన నాలుగో భార‌త బ్యాట‌ర్‌గా ఘ‌న‌త‌
సిడ్నీ టెస్టులో టీమిండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో మొద‌టి ఓవ‌ర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వ‌రుస బౌండ‌రీల‌తో విరుచుప‌డ్డాడు. దీంతో మొద‌టి ఓవ‌ర్‌లోనే భార‌త్‌కు 16 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో టెస్టుల్లో తొలి ఓవ‌ర్‌లోనే అత్య‌ధిక ప‌రుగులు కొట్టిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. అయితే, దాటిగా ఆడే క్ర‌మంలో 22 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.

నాలుగో భార‌త ఆట‌గాడిగా మ‌రో అరుదైన రికార్డు
ఇక అంత‌ర్జాతీయ అరంగేట్రం త‌ర్వాత‌ తొలిసారి ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న య‌శ‌స్వి జైస్వాల్ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో శ‌త‌కంతో పాటు 43.44 సగ‌టుతో ఐదు టెస్టుల్లో క‌లిపి 391 ప‌రుగులు చేశాడు. ఈ బీజీటీ సిరీస్‌లో భార‌త్ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్ జైస్వాలే. 

ఈ క్ర‌మంలో తొలి ఆసీస్‌ సిరీస్‌లోనే అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాలుగో భార‌త ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో ముర‌ళీ విజ‌య్ 482 ప‌రుగులు (2014-15), వీరేంద్ర సెహ్వాగ్ 464 ర‌న్స్ (2003-04), లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ 450 ర‌న్స్‌తో (1977-78) మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నారు. 


More Telugu News