హత్య కేసులో కస్టడీలో ఉన్న నిందితుడిని కలిసిన మహారాష్ట్ర మంత్రి అనుచరుడు

  • డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య
  • ఈ కేసులో వాల్మికి కరద్ అరెస్ట్.. 14 రోజుల పోలీస్ కస్టడీ 
  • బీడ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితుడితో మంత్రి సన్నిహితుడు బాలాజీ తండాలే సమావేశం
  • మంత్రి రాజీనామా చేయాలని ఎన్సీపీ (శరద్) డిమాండ్
సర్పంచ్ హత్య కేసు నిందితుడిని మహారాష్ట్ర మంత్రి సన్నిహితుడు కలవడం వివాదాస్పదమైంది. ఎన్సీపీ మంత్రి ధనంజయ్ ముండే అనుచరుడిగా చెబుతున్న వాల్మిక్ కరద్‌.. మసాజోగ్ గ్రామ సర్పంచ్ హత్యకేసులో అరెస్టయ్యాడు. కోర్టు అతడికి 14 రోజులు కస్టడీ విధించింది. ఈ క్రమంలో బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితుడిని మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండాలే కలవడం చర్చకు కారణమైంది. 

 దోపిడీని అడ్డుకున్న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ ను డిసెంబర్ 9న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ కేసులో క్రైం సిండికేట్‌ నడుపుతున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కరద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ధనంజయ్ ముండే మద్దతుదారుడైన బాలాజీ తండాలే నేడు బీడ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఉన్న కరద్‌ను వెళ్లి కలిశాడు. పోలీస్ స్టేషన్ వద్ద హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కరద్‌ను కలవడం వివాదాస్పదమైంది. నిందితుడితో బాలాజీ సమావేశమయ్యాడని హత్యకు గురైన సర్పంచ్ సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ విమర్శలపై స్పందించిన బాలాజీ మాట్లాడుతూ తనను ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు పిలిస్తేనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని చెప్పుకొచ్చాడు.

ఈ ఘటన రాజకీయంగానూ వేడి పుట్టించింది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత జితేంద్ర అవహద్ దీనిని తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. దర్యాప్తులో పారద్శకత కొరవడిందని, మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


More Telugu News