పిఠాపురంలో జనసేన మహాసభలు... తేదీలు ఇవే!

  • పిఠాపురంలో మార్చి 12 నుంచి ప్లీనరీ  
  • ప్లీనరీ సన్నాహాలపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కోర్ కమిటీ భేటీ
  • 14న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ వేదిక, తేదీలు ఖరారు అయ్యాయి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. 
 
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవన్ బలంగా నిలబడ్డారని, దాంతో కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

పార్టీ సిద్దాంతాలు, పవన్ ఆశయాలు ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, మేధావుల నుంచి ప్లీనరీలో సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మార్చి 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని, 14న బహిరంగ సభ జరుగుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 


More Telugu News