ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు.. గన్నవరంలో గొప్పగా టెర్మినల్ భవనం

  • శ్రీకాకుళం విమానాశ్రయానికి ఫీజిబిలిటీ పూర్తి
  • కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో గన్నవరంలో టెర్మినల్
  • ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రం ఏర్పాటు ఆలోచన
  • శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని, అక్కడ రెండు దశల్లో 1,383 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం భూసేకరణ జరుపుతున్నట్టు తెలిపారు. దగదర్తిలో 1,379 ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే 635 ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. అలాగే, నాగార్జునసాగర్‌లో 1,670, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్టు వివరించారు. ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించినట్టు చంద్రబాబు తెలిపారు. 

కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్
గన్నవరం విమానాశ్రయంలో నిర్మించే టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన ఆకృతులతో నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, దగదర్తి ప్రాంతంలో బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోందని, అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతున్నట్టు వివరించారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏవియేషన్ విశ్వవిద్యాలయం, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయి కాబట్టి అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News