జూన్ 15 లోపు తల్లికి వందనం పథకం అమలు చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

  • సామర్లకోటలో వేర్ హౌస్ గోడౌన్ల ప్రారంభం
  • హాజరైన అచ్చెన్నాయుడు
  • ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటీ నిలబెట్టుకుంటామని వెల్లడి
  • సూపర్ సిక్స్ హామీలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం
ఏపీలో సూపర్ సిక్స్ పథకాలపై కూడా వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్ లను అచ్చెన్నాయుడు నేడు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటీ నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. జూన్ 15 లోగా తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.22 వేల కోట్ల వడ్డీ కడుతోందని అన్నారు. 

కూటమి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని, కేంద్రం సహకారం అందించడం వల్ల రాష్ట్రానికి ఆక్సిజన్ అందించగలిగామని, తద్వారా రాష్ట్రం కుదుటపడుతోందిన వివరించారు. 

కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఖజానాలో ఉన్న సంపద సరిపోవడం లేదని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, వెనుకంజ వేయబోమని, అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.


More Telugu News