ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారు: పొన్నం ప్రభాకర్

  • బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదని విమర్శ
  • అధికారంలో ఉన్నన్నాళ్లు బీసీలు గుర్తుకు రాలేదని మండిపాటు
  • పదేళ్ళు బీసీలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీత
ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఏమాత్రం గౌరవం దక్కలేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నేతలకు బీసీలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు మాత్రం వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో బీసీలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. 

బీఆర్ఎస్ ముఖ్య రాజకీయ పదవుల్లో ఏదో ఒక పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీలో ఒక కులానికి చెందిన వ్యక్తి సీఎం అయితే... మరో కులానికి చెందిన వ్యక్తి పీసీసీ చీఫ్ అయ్యారని తెలిపారు. పార్టీలో తానూ హక్కుదారుడినే అని ఈటల రాజేందర్ అన్నందుకే ఆయనను బయటకు పంపించారన్నారు.

బీసీ హాస్టళ్లను బీఆర్ఎస్ పదేళ్లు పట్టించుకోలేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్ అన్నారు. తమ ప్రభుత్వం చేయిస్తున్న కుటుంబ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి నిపుణులతో చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదన్నారు. పార్టీ అజెండానే ముఖ్యమన్నారు.


More Telugu News