చంద్రబాబు నిర్వాకం వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగాయి: వరుదు కల్యాణి

  • తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టారన్న వరుదు కల్యాణి
  • ప్రతి బిడ్డకు రూ. 15 వేలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
  • ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలు చేయాలన్న కల్యాణి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శలు గుప్పించారు. తల్లికి నిల్... తండ్రికి ఫుల్ అనే విధంగా చంద్రబాబు పాలన ఉందని ఆమె విమర్శించారు. స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని అన్నారు. డ్రాప్ అవుట్స్ ను తగ్గించేందుకు అమ్మఒడి పథకాన్ని జగన్ తీసుకొచ్చారని... చంద్రబాబు నిర్వాకం వల్ల డ్రాప్ అవుట్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణమని కల్యాణి అన్నారు. ప్రతి బిడ్డకు రూ. 15,000 చొప్పున ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పేరుతో లక్షలాది మంది తల్లులకు, పిల్లలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పాలిచ్చే ఆవును వదులుకుని... తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News