మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పంత్‌కు తీవ్ర గాయం.. నొప్పితో విల‌విల‌లాడిన క్రికెట‌ర్‌.. ఇదిగో వీడియో!

  • సిడ్నీ వేదిక‌గా భార‌త్‌, ఆసీస్ ఐదో టెస్టు
  • స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వాపు
  • బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌
  • నొప్పితోనే బ్యాటింగ్ కొన‌సాగించిన పంత్‌
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో భార‌త బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ గాయ‌ప‌డ్డాడు. ఆసీస్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వెంట‌నే వాపు వ‌చ్చేసింది. ఆ నొప్పితో పంత్ విల‌విల‌లాడాడు. బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌లా ఏర్ప‌డింది. వెంట‌నే సిబ్బంది వ‌చ్చి చికిత్స అందించారు. ఆ త‌ర్వాత పంత్ తిరిగి ఆట‌ను కొన‌సాగించాడు. 35 ఓవ‌ర్‌ మూడో బంతికి ఇలా పంత్ గాయ‌ప‌డ్డాడు. బంతి బ‌లంగా తాక‌డంతో వెంట‌నే స్టార్క్.. పంత్ వ‌ద్ద‌కు వ‌చ్చి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 72 ప‌రుగుల‌కే కీల‌క‌మైన 4 వికెట్లు పారేసుకుంది. ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్ (04), య‌శ‌స్వి జైస్వాల్ (10) త‌క్కువ స్కోర్లకే పెవిలియ‌న్ చేరారు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్ (20), విరాట్ కోహ్లీ (17) కూడా నిరాశ ప‌రిచారు. అయితే, పంత్, ర‌వీంద్ర జ‌డేజా చాలాసేపు క్రీజులో పాతుకుపోయారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఈ ద్వ‌యం ఆచితూచి ఆడింది. 

ఈ ఇద్ద‌రూ దాదాపు 25 ఓవ‌ర్లు ఆడి, 48 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. ఈ క్ర‌మంలో బొలాండ్ బౌలింగ్‌లో పంత్ (40) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండా పెవిలియ‌న్ చేరాడు. దీంతో భార‌త్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజులో జ‌డేజా (15), సుంద‌ర్‌ (0) ఉండ‌గా.. భార‌త్ స్కోరు 120/6 (57 ఓవ‌ర్లు). ఆసీస్ బౌల‌ర్లో బొలాండ్ ఒక్క‌డే 4 వికెట్లు తీయ‌డం గ‌మ‌నార్హం.  


More Telugu News