హీరోయిన్ మాధవీలత ఒక వేస్ట్ క్యాండిడేట్: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • న్యూ ఇయర్ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించిన జేసీ
  • జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దన్న మాధవీలత
  • ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదంటూ జేసీ విమర్శ
సినీ హీరోయిన్, బీజేపీ నేత మాధవీలతపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మండిపడ్డారు. ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదని అన్నారు. 

జేసీ ఇంత తీవ్రంగా స్పందించడానికి ఒక కారణం ఉంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ పై మాధవీలత స్పందిస్తూ... జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. 

మాధవీలత వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు. మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని... జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని చెప్పారు. తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ నాయకులు హిజ్రాల కంటే దారుణమని అన్నారు.

మరోవైపు అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జేసీ మాట్లాడుతూ... బస్సు దగ్ధం ఘటనపై తాను ఫిర్యాదు చేయబోనని... చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని చెప్పారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, నిందితులను పట్టుకోవడం వారికి చేతకాదని అన్నారు. తమ బస్సును ఒక పథకం ప్రకారం దగ్ధం చేశారని... అయితే, పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 300 బస్సులు పోతేనే తాను బాధపడలేదని... ఇప్పుడు ఎందుకు బాధపడతానని అన్నారు.


More Telugu News