ఆసియాలోనే అత్యంత అధ్వాన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో బెంగళూరు టాప్!

  • 10 కిలోమీటర్ల ప్రయాణానికి 28 నిమిషాలకుపైగా జర్నీ
  • పూణేలో 27 నిమిషాలకు పైగా పడుతున్న వైనం
  • నివేదిక విడుదల చేసిన ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023‘
ఆసియాలో అత్యంత అధ్వాన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో భారత్‌కు చెందిన రెండు నగరాలు చేరాయి. వీటిలో బెంగళూరు తొలి స్థానాన్ని ఆక్రమించగా, పూణే రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏకంగా 28 నిమిషాల 10 సెకన్లు పడుతున్నట్టు ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023’ తెలిపింది. ఫలితంగా నగర వాసులు ఏడాదికి 132 అదనపు గంటలు ట్రాఫిక్‌లోనే గడుపుతున్నట్టు పేర్కొంది.

 పట్టణంలో మౌలిక సదుపాయాలు విస్తరిస్తుండటం, జనాభా పెరుగుతుండంతో బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోడ్ల తీరు మారడం లేదు. ఫలితంగా ఆసియాలో అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతున్న నగరాల్లో బెంగళూరు టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది.

బెంగళూరు తర్వాతి స్థానంలో పూణే నిలిచింది. ఇక్కడి రోడ్లపై 10 కిలోమీటర్ల ప్రయాణానికి 27 నిమిషాల 50 సెకన్లు పడుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు), తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు) నిలిచాయి. మొత్తం ఆరు ఖండాల్లోని 387 సిటీలను ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్’ అంచనా వేసి ఈ వివరాలను వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది ఈ జాబితాలో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ పది కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి సగటున 37 నిమిషాల 20 సెకన్లు పట్టింది. 


More Telugu News