కోహ్లీ సేమ్ మిస్టేక్.. చివరి టెస్టులోనూ భారత్ తీరుమారలేదుగా!

  • 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు
  • క్రీజులో కుదురుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన కోహ్లీ
  • చివరికి థర్డ్ స్లిప్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత్ తీరు మారడం లేదు. సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత స్టార్లు మరోమారు తేలిపోయారు. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. 

సిడ్నీ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో శామ్ కోన్‌స్టాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు కూడా కుదురుకోలేక కంగారూ బౌలర్లకు వికెట్లు సమర్పించి వెనుదిరిగారు. జైస్వాల్ (10), గిల్ (20) వచ్చినంత వేగంగా పెవిలియన్‌కు చేరారు. 

ఇక, ఈ సిరీస్‌లో విపరీతంగా విమర్శలకు గురవుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు తేలిపోయాడు. నాలుగో టెస్టులో అవుట్ అయినట్టుగానే ఈసారి కూడా వికెట్ సమర్పించుకున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి బోలాండ్ బౌలింగ్‌లో థర్డ్‌స్లిప్‌లో వెబ్‌స్టర్‌కు దొరికిపోయాడు. 69 బంతులు ఆడిన కోహ్లీ 17 పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. రిషభ్‌పంత్ (10), రవీంద్ర జడేజా (3) క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 2 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు.


More Telugu News