రేపటి నుంచి చివరి టెస్ట్.. బ్యాడ్‌న్యూస్ ప్రకటించిన కోచ్ గంభీర్

  • పేసర్ ఆకాశ్ దీప్ ఐదో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని ప్రకటించిన గౌతమ్ గంభీర్
  • వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా వెల్లడి
  • సిడ్నీ పిచ్‌ను పరిశీలించిన అనంతరం తుది జట్టుని నిర్ణయిస్తామని ప్రకటన
  • రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపటి (శుక్రవారం) నుంచి చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తవ్వగా ఆతిథ్య ఆసీస్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే మ్యాచ్ డ్రా అయినా, రద్దు అయినా ఆస్ట్రేలియాకే సిరీస్ దక్కుతుంది. దీంతో, టీమిండియా పకడ్బందీగా అత్యుత్తమ తుది జట్టుతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు.

సిడ్నీ వేదికగా జరగనున్న 5వ టెస్ట్ మ్యాచ్‌కు పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని, వెన్నునొప్పితో బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించిన అనంతరం తుది జట్టుని నిర్ణయిస్తామని చెప్పాడు. ఈ మేరకు గురువారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఈ పరిణామంతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బ్రిస్బేన్, మెల్‌బోర్న్‌ టెస్టులలో ఆడిన ఆకాశ్ దీప్ మొత్తం 5 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌లో ఫీల్డర్లు పలు క్యాచ్‌లను జారవిడిచారు, లేదంటే ఆకాశ్ దీప్ ఖాతాలో మరిన్ని వికెట్లు చేరి ఉండేవి. 

ఆకాశ్ దీప్ రెండు టెస్టులలో కలిపి మొత్తం 87.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సాధారణం కంటే ఎక్కువ ఓవర్లు వేయడంతో అతడికి వెన్ను పట్టివుండొచ్చు. కఠినంగా ఉండే ఆస్ట్రేలియా మైదానాల్లో ఆటగాళ్లు తరచుగా మోకాలు, చీలమండ వెన్ను సమస్యలకు గురవుతుంటారు. కాగా, ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరికి చోటు దక్కవచ్చు.


More Telugu News