నితీశ్ రెడ్డిపై ఆసీస్ లెజెండ్ ప్రశంసలు

  • తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్ రెడ్డికి సీనియర్ల ప్రశంసల జల్లు
  • మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన నితీశ్ 
  • టీమిండియాకు ప్రధాన బ్యాటర్‌లా నితీశ్ మారిపోయాడన్న మైఖేల్ క్లార్క్
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తెలుగు యువ ఆటగాడు నితీశ్‌ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ 189 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 114 రన్స్ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా నితీశ్ ఆట తీరును ప్రశంసించాడు. 

ఈ కుర్రాడు జీనియస్, సిరీస్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగి రాణిస్తున్నాడని అన్నాడు. అతను 21 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ప్రధాన బ్యాటర్‌లా మారిపోయాడన్నాడు. నితీశ్ ఏ ఆస్ట్రేలియన్ బౌలర్‌కూ భయపడలేదని అన్నాడు. ఓపికగా ఉండాల్సిన సమయంలో ఓర్పును ప్రదర్శించాడని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడన్నాడు. ఆసీస్‌తో చివరి టెస్టులో టీమిండియాకు అతను కీలకమవుతాడని మైఖేల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
 
ఇక, మెల్‌బోర్న్ టెస్టులో విజయంతో సిరీస్ లో ఆసీస్ 2-1 తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో (చివరి) టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ను 2-2 తో సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 


More Telugu News