ఇంతకంటే విషాదం ఉంటుందా?

  • భార్యతో గొడవ పడి బైక్‌తో పాటు బావిలో దూకేసిన భర్త సుందర్ కర్మాలి
  • సుందర్ ని రక్షించేందుకు బావిలో దూకిన మరో నలుగురూ మృతి
  • ఝార్ఖండ్ రాష్ట్రం హజూరీబాగ్ జిల్లాలో ఘటన
భార్యతో గొడవ పడిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా, అతన్ని కాపాడేందుకు వెళ్లిన మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని హజూరీబాగ్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం .. సుందర్ కర్మాలి (27) అనే వ్యక్తి తన భార్య రూపాదేవితో గొడవ పడి కోపంతో ఆత్మహత్య చేసుకోవాలని మోటారు సైకిల్‌ని బావిలోకి పోనిచ్చాడు. 

సుందర్ కర్మాలి బావిలో పడటంతో అతన్ని రక్షించాలని మరో నలుగురు కూడా బావిలోకి దూకారు. అయితే సుందర్ కర్మాలితో పాటు నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారి బీఎన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. మృతులను రాహుల్ కల్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా గుర్తించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తిని కాపాడబోయి నలుగురు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 


More Telugu News