ఫెరారీ కారుకు ఎడ్లబండే దిక్కయింది.. ఇదిగో వీడియో!

  • బీచ్ రైడింగ్‌ చేస్తుండగా ఇసుకలో ఇరుక్కుపోయిన ఫెరారీ కారు
  • రాయ్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌లో ఘటన 
  • ఎడ్లబండి సాయంతో కారును లాగిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో  
సముద్రపు అలలను చూస్తూ రయ్ రయ్ మంటూ కారులో దూసుకువెళుతుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అందుకే ఎక్కువ మంది బీచ్‌ రైడింగ్‌కు వెళ్లి అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే బీచ్ రైడింగ్ సవ్యంగా సాగితే బాగానే ఉంటుంది. కానీ బీచ్ రైడింగ్ సమయంలో కారు టైర్లు ఇసుకలో ఇరుక్కొని మొరాయిస్తే వారి ఆనందం ఆవిరి అవుతుంది. అటువంటి ఘటనే ఇటీవల మహారాష్ట్రలోని రా‌య్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌లో జరిగింది. ఇసుకలో కారు కూరుకుపోవడంతో ఎడ్లబండితో బయటకు లాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన ఫెరారీ కారును ఎడ్లబండి లాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ముంబయికి చెందిన ఇద్దరు వ్యక్తులు .. తమ ఫెరారీ కారులో రేవ్‌దండా బీచ్‌కి వెళ్లి రైడింగ్ చేస్తూ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా, అకస్మాత్తుగా కారు టైర్లు ఇసుకలో కూరుకుపోయాయి. దీంతో అక్కడి వారంతా వచ్చి కారును బయటకు లాగే ప్రయత్నం చేసినా ఫలితం కనబడలేదు. అదే సమయంలో అటుగా వెల్తున్న ఓ ఎడ్లబండి కనిపించడంతో వీరు అతన్ని సాయం కోరారు. ఫెరారీ కారు ముందు భాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండి ముందుకు పోనివ్వడంతో కారు ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఖరీదైన కారుకు ఎడ్లబండి దిక్కయ్యిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి.  


More Telugu News